ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే.. ఈ ఫలితాలు విడుదల చేసిన సమయంలో బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన ఈమని తేజస్వినికి అన్ని సబ్జెక్టుల్లో 90కు పైగా మార్కులు పొందినప్పటికీ సోషల్ సబ్జెక్టులో కేవలం 23 మార్కులు రావడంతో ఫెయిల్ అయ్యింది.
బాగా చదివే విద్యార్థిని కావడంతో ఉపాధ్యాయులు సలహాతో సోషల్ సబ్జెక్ట్ పునః మూల్యాంకనం కు విద్యార్థిని దరఖాస్తు చేసుకుంది. పునః మూల్యాంకనంలో 96 మార్కులు వచ్చాయి. ఇప్పుడు అన్ని సబ్జెక్టులు కలుపుకొని 575 మార్కులు వచ్చాయి. మంచి మార్కులు వచ్చినప్పటికీ విద్యార్థినికి దురదృష్టం వెంటాడింది.
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు మే 20వ తేదీతో గడువు ముగిసింది. పునః మూల్యాంకనంలో తాను పాసైనప్పటికీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోలేకపోయింది. తనకు వచ్చిన మార్కులకు సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అప్లై చేయడానికి అవకాశం లేకపోవడంతో విద్యార్థిని, విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా బాధపడుతున్నారు.
తేజస్వినికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.